ఈ ఆరోగ్యసమస్యలు ఉంటే వంకాయలు తినకండి..
కూరగాయలలో రాజాగా పేరు పొందిన వంకాయ అంటే అందరికీ నోరూరుతుంది. వంకాయలను రకరకాలుగా వండినప్పటికీ అత్యధికులకు గుత్తి వంకాయ కూర అంటే మహా ఇష్టం. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవారు వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనీమియాతో బాధపడేవారు వంకాయను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే దీనిలో ఐరన్‌ను తగ్గించే లక్షణాలున్నాయట. రక్తహీనత సమస్య దీనివల్ల తీవ్రమవుతుందని పేర్కొన్నారు.
కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలతో ఇబ్బందులు పడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలట. దీనివల్ల అసిడిటీ సమస్య కూడా అధికమవుతుంది.
కిడ్నీలలో రాళ్లు, కిడ్నీ సమస్యలు ఉండేవారు కూడా వంకాయలు తినకూడదు. ఎందుకంటే వంకాయలోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంది.
ఇంకా కీళ్ల నొప్పులు ఉన్నవారు వంకాయలు తింటే శరీరం వాపులు, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. దీనిలో ఉండే సోలనిన్ అనే పదార్థం దీనికి కారణంగా చెప్పవచ్చు. వంకాయలు తినడం వల్ల దురదలు, దద్దుర్లు వంటి అలర్జీలు ఉంటే వారు కూడా వంకాయలకు దూరంగా ఉండడం మేలు.

పైన పేర్కొన్న సమస్యలు లేనివారు వంకాయలు భేషుగ్గా తినొచ్చు. కూరలు, వేపుళ్లు, చట్నీలు వంటి రకరకాల వంటకాలతో వంకాయలను ఆస్వాదించవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. దీనిలోని పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.