వైభవంగా ధర్మపురి నారసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తెలంగాణాలో ప్రసిద్ధికెక్కిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ రోజు( శుక్రవారం) అంగరంగవైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈరోజు రాత్రి పుట్ట బంగారం కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉదయం దేవస్థానం ఉప ప్రధాన అర్చకుని ఇంటికి అధికారులు మేళతాళాలతో వెళ్లి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలను అందజేసి ఆహ్వానించడంతో తంతు మొదలవుతుంది. కలశ స్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం చింతామని చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వేదిక వద్దకు మృత్ సంగ్రహణం (పుట్ట బంగారం) కార్యక్రమాన్ని వేదమంత్రాలతో నిర్వహిస్తారు. ఈ నెల 15 వరకూ 13 రోజుల పాటు జరిపే ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుండి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో ఎండ తగలకుండా చలువ పందిళ్ల ఏర్పాటు జరిగింది. గోదావరి నదిలో స్నానాలకు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయడంలో అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు.

