‘కేంద్రం భారీగా ఆర్థిక సహాయం చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది’ …జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా ఆర్థిక సహాయం అందించిందని, కానీ రాష్ట్రప్రభుత్వం ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తంగా నిర్వహిస్తోందని విచారం వ్యక్తం చేశారు. మే నెలలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తాను ప్రశ్నలు అడిగానని, ప్రత్యేక ప్యాకేజీని కేటాయించిందా అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి సమాధానమిస్తూ, కేటాయించిందని తెలిపారన్నారు. రాష్ట్రప్రభుత్వ అభ్యర్థన మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి మే 19 వ తేదీన 10,460 కోట్ల రూపాయలు విడుదల చేసిందని పంకజ్ చౌదరి తెలిపారు. అంతేకాక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని, అధిక లోన్లు కూడా సర్దుబాటు చేశామని తెలిపారు. ఇక పోలవరానికి ఇప్పటి వరకూ 14,460 కోట్ల రూపాయలు విడుదల చేశారని కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఇంత చేసిన నరేంద్రమోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, రాష్ట్రప్రజల పట్ల ఆయనకు ఎంతో శ్రద్ధ ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఇంత చేసినా, రాష్ట్రప్రభుత్వం సరిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోతోందని విమర్శలు చేశారు.