మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు
మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో రిటర్నింగ్ అధికారి పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుర్తులు మార్చాలనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకొని ఇవాళ సాయంత్రంలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను ఈసీ ఆదేశించింది. ఈలోగా ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపించారు. సాయంత్రంలోగా కొత్త రిటర్నింగ్ అధికారి నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తర్వాత బేబీ వాకర్ గుర్తు ఇచ్చారంటూ ఇటీవల యుగతులసి పార్టీ అభ్యర్థి కె. శివకుమార్ కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందిస్తూ.. గుర్తు మార్పు విషయాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. శివకుమార్‌కు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తు మార్పును ఈసీ తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని ఆదేశించింది. ఎన్నికల అధికారులు ఈసీ ఆదేశాల ప్రకారం ఫారం 7(ఏ)ను సవరించి యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గెజిట్ జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆర్వోపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.