మెలితిప్పిన అద్భుత కట్టడం DANCE OF LIGHT
ప్రపంచంలోనే అత్యంత మెలికలు తిరిగిన భారీ టవర్ను ఇటీవల చైనాలోని చోంగ్ క్వింగ్ నగరంలో నిర్మించారు. ఏదైనా భవనం అంటే పొడవుగా నిలబడినట్లు ఉంటుంది కానీ, ఈ విచిత్ర భవనం గట్టిగా పట్టుకుని మెలి తిప్పిన డిజైన్లో చాలా తమాషాగా ఉంటుంది.
భూమికి ఉత్తర ధ్రువాల వద్ద ఆకాశంలో అరోరా బొరియాలిస్ అనే చిత్రమైన కాంతులు వెదజల్లుతుంటాయి. ఈ భవనం కూడా అలాగే కాంతులను చిమ్మేలా దీనికి డాన్స్ ఆఫ్ లైట్ అని పేరు పెట్టినట్లు ఈ భవనాన్ని నిర్మించిన ఈడస్ అనే సంస్థ చెప్పింది.
వెస్ట్ చైనాలోని చోంగ్ క్వింగ్ నగరంలో ఇటీవలే దీనిని నిర్మించారు. ఇది 180 మీటర్ల ఎత్తుతో దాదాపు 8.8 డిగ్రీల మెలికతో కింద నుండి పై వరకు తిప్పేసినట్లు ఉంటుంది.
ఈ భవనం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ వివిధ కోణాల్లో కాంతిని ప్రతిఫలిస్తూ మెరుస్తూ ఉంటుంది. రాత్రిపూట వివిధ దిక్కుల నుండి వచ్చే కాంతిని కూడా ప్రతిఫలింపజేస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలా మెలితిరిగిన భారీ భవంతులు అతికొద్దిచోట్ల మాత్రమే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా మెలితిరిగిన భవనం ఇదే. దుబాయిలోని 306 మీటర్ల ఎత్తైన కయాన్ టవర్, స్వీడన్ లోని టర్నింగ్ టోర్సో భవనాలు కూడా ఇలాగే మెలితిరిగినట్లుంటాయి.


