మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై సందిగ్దత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై సందిగ్దత నెలకొంది. ఆయన అంత్యక్రియలను స్మారక చిహ్నం ఏర్పాటు చేసే స్థలంలోనే జరపాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని కోరారు. అయితే నిగమ్ బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రజల దర్శనార్థం ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాజకీయాలు చేస్తోందని, స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీకి తెలియజేశామని బీజేపీ అంటోంది. తగిన స్థలాన్ని ఎంపిక చేయడానికి సమయం పడుతుందని పేర్కొంది. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోనే ఉన్నప్పటికీ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్మారక చిహ్నాన్ని నిర్మించలేదన్నారు. దీనితో పాటు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా స్వస్థలమైన హైదరాబాద్‌లో జరగాలని కాంగ్రెస్ కోరిందని వారు గుర్తు చేశారు.

