గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర
– దొడ్డిదారిలో పంచాయతీ నిధుల దారిమళ్లింపు ఇందులో భాగమే
– తెలంగాణ సర్కారు దిగజారుడుతనంతో వ్యవహరిస్తోందన్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
– పెట్రో ఉత్పత్తుల మీద వ్యాట్ తో ప్రజల నడ్డి విరుస్తూ.. కేంద్రంపై నిందలా?
– దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగం.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం
– ఆయిల్ పామ్ విషయంలోనూ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజం
– కేంద్ర నిధులకు సంబంధించిన పత్రాలను విడుదల చేసిన కిషన్ రెడ్డి
– దుందుడుకు విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయిస్తున్నారు
– ఇలాగైతే.. ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా కష్టమే
– ప్రజలు రాజకీయ పార్టీల నైతికత, వ్యవహార శైలిని గమనిస్తున్నారన్న కేంద్ర మంత్రి
దేశ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు గ్రామాల్లో మౌలికవసతుల కల్పనను సునిశ్చితం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామాలకు ఇచ్చే నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం పంచాయతీల అకౌంట్లలోకి నేరుగా రూ.5వేల కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వేసిన గంటల్లోనే దారి మళ్లించడం దారుణమని ఆయన అన్నారు.
‘గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీ సిబ్బంది జీతాల కోసం15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు చేసింది. అనేక రాష్ట్రాల్లో జీపీలకు ఇవ్వాల్సిన నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జీపీలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నాయి. దీన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులిస్తోంది. ఇటీవల కేంద్రం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు సుమారు రూ.5080 కోట్లు విడుదల చేస్తే, డిజిటల్ కీ ల ద్వారా కేవలం గంటల్లోనే దారి మళ్లించింది. ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి, దిగజారుడుతనం మరొకటి ఉండదు’ అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం అర్థరహితమైన విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రం కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్నదని ఆయన మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు నిధులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారిమళ్లించి పేద ప్రజలకు కాకుండా, కాంట్రాక్టర్ల పరం చేసింది. పైగా ప్రభుత్వ పెద్దలే రోడ్లు ఎక్కి నిరసన చేస్తున్నారు. తప్పులు చేస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం గుంజుకుంటే.. సర్పంచులు నిరసన తెలుపకుండా పోలీసులతో నిర్భందిస్తున్నారు. చివరకు సర్పంచులు కోర్టుకు వెళ్లి, కోర్టు నుండి నిరసన చేయడానికి అనుమతి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు, ధర్నాలు, నిరసన తెలపాలంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా.. వంట నూనెల దిగుమతులు తగ్గించాలని, దేశీయంగానే వంట నూనెల ఉత్పత్తిని పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నదని కేంద్రమంత్రి అన్నారు. ‘ఎడిబుల్ ఆయిల్ కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చి, కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో దేశంలో 6.5 లక్షల హెక్టార్లలో ఆయిల్ పంటలు వేసేలా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడింది. రాష్ట్రాలు, కేంద్రం ఐక్యతతో పనిచేస్తే.. ప్రస్తుతం ఉన్న 3.83 లక్షల టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తిని.. 2025 నాటికి సుమారు 12 లక్షల టన్నులకు పెంచాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో 15 శాతం భూములు ఆయిల్ ఫామ్ పంటలకు అనువుగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021–22, 2022–23 సంవత్సరాలకు గానూ.. రూ.114 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసిందో తెలపాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపుతోందని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, అస్సాంలతో పోలిస్తే.. తెలంగాణ ప్రజలు పెట్రోలు లీటరుకు 13 రూపాయలు అధికంగా చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘దేశంలో అత్యధిక వ్యాట్ తెలంగాణలో ఉంది. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు 23 రాష్ట్రాలు కేంద్రంతోపాటు ఇంధన ధరల మీద వ్యాట్ ను తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తుల మీద 2014-2015 నుంచి నేటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ.69,190 కోట్ల ఆదాయం వచ్చింది. అయినా అంతా కేంద్రమే తీసుకుపోతోందని టీఆర్ఎస్ నేతలు దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు. 2015లో వ్యాట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.4,527 కోట్లు కాగా.. 2021-22లో అది రూ.13,170 కోట్లకు పెరిగింది’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ.. పెట్రోల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీల నష్టాన్ని కేంద్రం భరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ చేస్తూనే.. రైతులకు ఏడాదికి రూ.6వేలు, 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, 220 కోట్లకు పైగా ఉచిత టీకాలు తదితర సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో వస్తున్న ఆదాయాన్ని దేశమంతా వినియోగిస్తున్నారన్న కల్వకుంట్ల కుటుంబ వ్యాఖ్యలపైనా కిషన్ రెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్లో వసూలైన డబ్బును హైదరాబాద్లోనే పెడుతున్నారా? గజ్వేల్, సిద్దిపేటల్లో వసూలైన డబ్బులు అక్కడే ఖర్చు పెడుతున్నారా? ప్రభుత్వం చెప్పాల’ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద డబ్బులు ఇచ్చి, నిబంధనల ప్రకారం రాష్ట్రం డబ్బులు ఖర్చుచేయకుండా ఆ నిధులను దారిమళ్లిస్తోందన్నారు. నిధుల వివరాలు అడిగితే.. ప్రభుత్వ పెద్దలు రోడ్లెక్కి ధర్నా చేసి కేంద్రం దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తుండటం చూస్తుంటే.. ‘ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటా’ అన్న సామెత గుర్తువస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దుందుడుకు విధానాల ద్వారా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలున్నాయన్న కిషన్ రెడ్డి.. ఇదే విధానం కొనసాగితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావొచ్చన్నారు.
పథకాల సంక్షేమం నేరుగా లబ్ధిదారులకు అందించే లక్ష్యంతోనే కేంద్రం డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చిందని.. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా ఇస్తోందన్నారు. పేద ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్ ల విషయంలోనూ రాష్ట్రం అవసరమైన పత్రాలు అందించని కారణంగా.. పేద ఇంజనీరింగ్ ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.300 కోట్ల స్కాలర్ షిప్ లు అందడం లేదన్నారు. ల్యాండ్, లిక్కర్, బొగ్గు,సున్నపురాయి, ఇసుక మాఫియాలతో తెలంగాణ దోపిడీకి గురవుతోందన్నారు.