కాంగ్రెస్‌ది ఎన్నికల బంధం.. బీఆర్ఎస్‌ది పేగు బంధం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలోనే తెలంగాణకు వస్తారు.. వారిది తెలంగాణతో కేవలం ఎన్నికల బంధమే. బీఆర్ఎస్‌ది మాత్రం పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
నిజామాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల సమయంలోనే తెలంగాణకు వస్తారు. వారిది తెలంగాణతో కేవలం ఎన్నికల బంధమే. బీఆర్ఎస్‌ది మాత్రం పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపింది అప్పటి ప్రధాని నెహ్రూ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను బలిగొంది ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం. తెలంగాణ వ్యక్తి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్‌గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రత్యేక తెలంగాణ అడిగినందుకు అంజయ్యను తొలగించారు. 2009 లో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి.. మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో వందల మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు. నగరంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో స్థానికులతో కలిసి కవిత బతుకమ్మ ఆటలాడారు.