కాంగ్రెస్ పనైపోయింది.. వారి గురించి అడగొద్దు
కొద్ది నెలల్లో జరగనున్నగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పీడ్ పెంచింది . గుజరాత్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అక్కడి ఓటర్లను ఆకట్టుకునే దిశగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆప్ అధినేత, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బదులిస్తూ.. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, దాని గురించి ప్రస్తావించొద్దని వ్యాఖ్యానించడం గమనార్హం.

పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ చేసిన విమర్శల గురించి కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ”ఎవరు ఈ ప్రశ్న అడిగింది. కాంగ్రెస్ పని అయిపోయింది. వారికి సంబంధించిన ప్రశ్నలను తీసుకోవడం మానేయండి. వారి విమర్శల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ కాగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో బీజేపీని ఎదుర్కొనేది ఆప్ మాత్రమేనని కేజ్రీవాల్ దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజలు తమ ఓటు హక్కును వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.

గుజరాత్‌లోని అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్ ప్రజలకు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, తమ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడకుండా చూస్తామని ప్రకటించారు. ఇలా పట్టుబడితే జైలు శిక్ష విధించేలా చేస్తామని పేర్కొన్నారు.
ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థి మేధా పాట్కరా..?
అలాగే గుజరాత్‌లో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలని ఆప్ చూస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై తనదైన శైలిలో కేజ్రీవాల్ స్పందించారు. నరేంద్ర మోదీ తర్వాత సోనియా గాంధీని ప్రధానిని చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తాను ఆరోపిస్తున్నానని, దీనిపై బీజేపీ ఏమంటుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

