కర్నాటకలో కాంగ్రెస్ ముందస్తు వ్యూహం, ఆచితూచి అభ్యర్థుల కూర్పు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. వీరిద్దరూ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ తొలి జాబితాలో మొత్తం 224 నియోజకవర్గాలకు 124 పేర్లను ఇవాళ విడుదల చేసింది. కనకపుర నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ మళ్లీ పోటీ చేయనుండగా, ప్రస్తుతం ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ (మైసూరు) నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోలార్ నుండి కూడా పోటీ చేయాలని ఆశించారు. గతంలో ఆయన రెండు స్థానాల నుంచి బరిలో దిగాడు. కోలార్ నుంచి బరిలోకి దిగాలని నెలల తరబడి రంగం సిద్ధం చేసుకున్నారు సిద్ధరామయ్య.

ఫిబ్రవరిలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తన అధికారిక దరఖాస్తులో, సిద్ధరామయ్య తాను ఎన్నుకునే మూడు నియోజకవర్గాల్లో బాదామి, వరుణ, కోలార్‌లను పేర్కొన్నాడు. బాదామి, కోలార్‌లు తొలి జాబితాలో ఎవరికీ కేటాయించలేదు. గతంలో మాదిరిగానే రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని సిద్ధరామయ్య యోచిస్తున్నారు. కోలార్ నుంచి ఆయన గెలవకపోవచ్చని స్థానిక నివేదికలు సూచిస్తున్నందున ఆయనకు కోలార్ వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య గత ఎన్నికల్లో వరుణ, బాదామి నుంచి పోటీ చేశారు. బాదామి నియోజకవర్గం నుంచి గెలవడం విషయంలో ఉన్న అనేక అంశాలను పార్టీ దృష్టికి ఆయన తీసుకొచ్చారు.

తొలి జాబితాలో రాష్ట్ర అగ్రనేతలు, మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 91 ఏళ్ల శామనూరు శివశంకరప్ప దావణగెరె సౌత్ నుంచి టికెట్ సాధించడం విశేషం. ఇదిలావుండగా, కోలార్‌కు చెందిన ప్రముఖ పార్టీ నాయకుడు, ఎంపీ కేహెచ్ మునియప్పకు దేవనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ లభించింది. కర్ణాటక మేలో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు OBC కోటా కింద నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తూ, రెండు ప్రధాన వర్గాలైన లింగాయత్‌లు, వొక్కలిగలకు ఒక్కొక్కరికి రెండు శాతం రిజర్వేషన్ల కల్పించింది. ముస్లింలు ఇకపై 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్ కేటగిరీ కిందకు వస్తారు. మిగతా కులాలతో కలిసి ఈ కోటా కింద ముస్లింలు రిజర్వేషన్లను పొందాల్సి ఉంటుంది.

నాలుగు శాతం రిజర్వేషన్ల ఉన్న వొక్కలిగలకు ఆరు శాతం, ఐదు శాతం రిజర్వేషన్లు పొందుతున్న లింగాయత్‌లకు ఇప్పుడు ఏడు శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మార్చి 17న ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను క్లియర్ చేసింది. రాహుల్ గాంధీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అధికార బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న దక్షిణాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.

