Andhra PradeshHome Page Slider

తెలుగుదేశం పార్టీలో కలవరం

తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో కలవరం మొదలైంది. కీలకమైన ఎన్నికల తరుణంలో ఆకస్మికంగా నేతలు అనంత లోకాలకు వెళ్లిపోవడం ఆ పార్టీ క్యాడర్‌ను కొంత నైరాశ్యంలోకి నెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ కోసం శ్రమించే కీలక నేతలు అకాల మృత్యువాత పడటం ఆ పార్టీని కొంత ఆందోళనలకు గురిచేస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ తారకరత్నతో పాటు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును కోల్పోయింది. తాజాగా తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ యువనేత పరుపుల రాజా ఆకస్మిక మృత్యువాత పడ్డారు. ఈ ముగ్గురు నేతలు వరుసగా గుండెపోటుతోనే మరణించడం కలవరానికి గురిచేస్తోంది. గతంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఆకస్మికంగా మరణం పాలయ్యారు. 2012 -13 మధ్యకాలంలో పార్టీకి వెన్నుముక గా నిలిచిన కింజారపు ఎర్రంనాయుడు, గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాసారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలను కోల్పోయి ఆందోళనకు గురైంది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి పార్టీలో కనిపిస్తుంది. రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు కీలక నేతలను పార్టీ కోల్పోవడంతో ఆ పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది.