సీఎంఆర్ లేడీస్ హాస్టల్ ఘటన..300 పైగా వీడియోలు
మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులు తమకు భద్రత కరువయ్యిందంటూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 300 పైగా వీడియోలు తీశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి కాలేజి వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాలేజీ హాస్టల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మాయిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకూ ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుండి 12 సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్లలో హాస్టల్‌లో డీజే ఈవెంట్ ఏర్పాటు చేశారు. దీని తర్వాత బాత్ రూమ్‌లో కెమెరాను గమనించిన అమ్మాయిలు ఈ విషయాన్ని గురించి ఫిర్యాదు చేశారు. హాస్టల్ బాత్‌రూమ్ వెంటిలేటర్ వద్ద చేతి గుర్తులు కనిపెట్టారు. అలాగే బయట నుండి కెమెరా పెట్టినట్టుగా గుర్తులు కూడా కనిపించాయి. లేడీస్ హాస్టల్‌కి, పనివాళ్లు ఉండే స్థలానికి మధ్యలో అడ్డుగోడ లేదు. అలాగే హాస్టల్ వద్ద సెక్యూరిటీ లేదు. వార్డెన్లు కూడా పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేస్తే బాధితులనే తప్పు పడుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వస్తే, కాలేజీ ఛైర్మన్ ఎమ్మెల్యే మల్లారెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.