మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ సరికొత్త వ్యూహాలు
◆ వారంలో 3 రోజులు విశాఖలో, 4 రోజులు అమరావతిలో
రాజధాని విషయంలో సీఎం జగన్ ఫుల్ క్లారిటీ
◆ పాలన విషయంలో సీఎం జగన్ సరికొత్త వ్యూహాలు
◆ నూతన సంవత్సరంలో విశాఖలో క్యాంప్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై ప్రాంతాలవారీగా విడిపడి ఉద్యమాలు తీవ్రమవుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మూడు రాజధానుల అంశం రోజుకు ఒక మలుపు తిరుగుతుండటం, సుప్రీంకోర్టులో విచారణ కూడా ఆలస్యం అవుతుండటం మరోవైపు అమరావతి పాదయాత్ర తిరిగి మొదలు కానుండటంతో వైఎస్ జగన్ మరోసారి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏది ఏమైనా నూతన సంవత్సరంలో విశాఖలో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ నుండే పరిపాలన సాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఆ మేరకు ఆయన వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఇప్పటి నుండే తాను అనుకున్నది చేయాలని ముందుకు సాగుతున్నారు.

ఒకవైపు కులాల వారీగా సమావేశాలు నిర్వహించటం మరోవైపు తాను ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ మూడు ప్రాంతాల ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించటం వంటి అంశాలు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మేలు చేకూరుస్తాయని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు కాపాడటంతో పాటు తాను అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్ పెద్ద కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మేరకు ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమవుతుంది. తాను ఎక్కడ ఉంటే అదే రాజధాని అనే నినాదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

వారంలో మూడు రోజులు పాటు విశాఖ కేంద్రంగానూ మిగిలిన నాలుగు రోజులు అమరావతి కేంద్రంగానూ తన క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని విశ్వాసనీయ సమాచారం. ఇప్పటికే రాజధానిపై కోర్టులో విచారణ కొనసాగుతుండగానే తాను మాత్రం విశాఖకు మకాం మారిస్తే ఎలా ఉంటుందని దానిపై ముఖ్యులతో జగన్ చర్చినిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ జాతీయ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనే వ్యాఖ్యలు కూడా చేయటంతో ఇప్పుడు అదే కోణంలో వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.