శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం
శ్రీశైలం: శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో తొలుత రత్నగర్భ గణపతిని సీఎం దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ ఎం డీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం.. జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని సాగర్‌కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

