crimeHome Page SliderInternationalNews AlertPolitics

సిరియాలో మళ్లీ చెలరేగిన అంతర్యుద్ధం..1000 మందికి పైగా మృతి

నిరంతరం అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న సిరియాలో ప్రభుత్వ మార్పిడి తర్వాత కొంత శాంతి నెలకొందని ప్రపంచం భావించింది. కానీ రెండ్రోజులుగా మళ్లీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భద్రతా దళాలు, మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ దాడులలో సామాన్య ప్రజలు 750 మంది సహా 1000 మందికి పైగా మరణించారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుండి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్‌ మద్దతుదారులు అలావైట్స్‌ అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రతీకార దాడులు మొదలుపెట్టారు. గత 14 ఏళ్లుగా ఇంత మారణకాండ ఎన్నడూ జరగలేదని యుద్ధనియంత్రణ సంస్థలు చెప్తున్నాయి. ఈ పోరాటాలు చోటు చేసుకున్న ప్రాంతాలలో విద్యుత్, తాగునీరు, బేకరీలను నిలిపివేశారు. నగరమంతా మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయని చెప్తున్నారు. సిరియన్ దళాలకు మాత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బనియాస్, జబ్లే, లటికాయ నగరాలు ఉద్రిక్తంగా మారాయి. మూడు నెలల క్రితం చెలరేగిన తిరుగుబాటు దారుల యుద్ధంలో అప్పటి సిరియా అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. పారంపర్యంగా నియంతృత్వపాలన కొనసాగిస్తున్న అసద్‌పై తిరుగుబాటు చేసిన వారు అధ్యక్ష భవనాన్ని, అధికారాన్ని చేజిక్కించుకున్నారు.