InternationalNews Alert

అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో చైనా అక్రమ నిర్మాణాలు

డ్రాగన్ చైనా.. భారత్ భూభాగంపై ఎప్పటినుండో కన్నేసింది. సరిహద్దు ప్రాంతాలపై నెమ్మది నెమ్మదిగా ఆక్రమణలకు పాల్పడుతోంది. మొన్నటికి మొన్న పాంగాంగ్ లేక్ వరకూ ఆక్రమణలు జరిపింది. తాజాగా అరుణాచలప్రదేశ్‌పై దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. అరుణాచలప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద కొందరు స్థానికులు చైనా చర్యలపై వీడియోలు తీయడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి. చగ్లాగామ్‌లోని హడిగర డెల్టా-6 వద్ద నిర్మాణ యంత్రాలను చైనా భారీగా ఉంచింది. అక్కడకు వెళ్లడానికి కష్టమైనా స్థానిక ప్రజలు వీడియోలు తీశారు. అక్కడ చైనా హెలీప్యాడ్‌ను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై భారత రక్షణ వర్గాలు ఏ ప్రకటన చేయలేదు. ఇవన్నీ నిరాధారమైనవని అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఈ నిర్మాణాలు చైనా భూభాగంలోనే  జరుగుతున్నాయని అంటున్నారు. చైనా దురాక్రమణకు పాల్పడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా చొరబాట్ల వల్ల తాము చాలా భయపడుతున్నామని, చైనా సరిహద్దులోని మెచుఖా గ్రామ నివాసులు తెలిపారు. కాగా భారత సైన్యం ఈ గ్రామ సరిహద్దులకు ఎవరినీ అనుమతించట్లేదు.

Read more: హోరాహోరీ పోరులో పాక్‌పై భారత్ ఉత్కంఠ గెలుపు