చైనా వైరస్ వ్యాప్తి..మరో రెండు కేసులు
చైనాలో పుట్టిన హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లో కూడా గుబులు రేపుతోంది. నిన్న కర్ణాటక, గుజరాత్‌లలో వెలుగు చూసిన కేసులు నేడు చెన్నైలో కూడా తొంగి చూశాయి. బెంగళూరులో ఇద్దరు నెలల వయసున్న శిశువులకు, గుజరాత్‌లో ఒకరికి, తాజాగా చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్‌పేట్, గిండిలోని ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన ఇద్దరు శిశువులకు వైద్య పరీక్షలు చేయగా, వైరస్ సోకినట్లు తేలింది. అయితే ఇది పాత వైరస్సేనని, కంగారు పడవద్దని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకూ వైరస్ నిర్థారణ అయిన వారందరూ నెలల శిశువులు కావడం, వారికి ఎలాంటి విదేశీ ప్రయాణ నేపథ్యం లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వైరస్ ఎలా సోకిందన్నది తేలాల్సి ఉంది. ఈ వైరస్ 2001 నుండి ఉందని, గాలి శ్వాస ప్రక్రియ ద్వారా వ్యాపిస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెప్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సీజనల్ కేసులను ఎదుర్కొనేందుకు వైద్య సామాగ్రి, పడకలు, ఇతర వసతులతో ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య సేవల డైరక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు.

