తెలంగాణలో సైబర్ నేరాలకు చెక్..!
సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో HICC లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి “సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ -2025” ను సీఎం రేవంత్ రెడ్డి… ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు.సైబర్ క్రిమినల్స్ ఇటీవలి కాలంలో దాదాపు 22 వేల కోట్ల రూపాయలను కాజేసినట్టు అంచనాలు వచ్చాయని, ప్రజల జీవన స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రమాదకరమైన పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఫేక్‌న్యూస్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తి సమాజానికి చేటు కలిగిస్తున్నాయని అన్నారు.

