సుప్రీంకోర్టుకు చంద్రబాబు, వాట్ నెక్స్ట్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి పై నమోదైన స్కిల్ స్కామ్ కేసు కు సంబంధించి విచారణ ఇప్పటివరకు రాష్ట్రానికే పరిమితం కాగా, తాజా పిటిషన్‌తో కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. స్కిల్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నాటి నుంచి ఆ తర్వాత పరిణామాలు హైకోర్టులో న్యాయపోరాటం బెయిల్ కోసం ప్రయత్నం కస్టడీ పిటిషన్‌కు అనుమతి రావటం తదితర అంశాలన్నిటిలో చంద్రబాబుకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ వస్తున్నాయి. దీంట్లో భాగంగానే స్కిల్ కేసులో ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటి షన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో చంద్రబాబు పరిస్థితి రాను రాను మరింత జటిలమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఈ కేసులపై సుప్రీంకోర్టు లోనే తేల్చుకోవాలని చంద్రబాబు న్యాయనిపుణుల బృందం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.