Andhra PradeshBreaking NewsHealthhome page sliderHome Page SliderNewsNews AlertTrending Today

కరేడు రైతులపై చంద్రబాబు కుట్ర: వైఎస్ జగన్

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రతో కరేడు రైతులను తరిమేయాలని చూస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో భయంకర పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలు చేస్తూ, రాజ్యాంగ విలువలనునే నాశనం చేసే స్థితికి తీసుకెళ్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. “కరేడు చాలా విచిత్రమైన విషయం. రైతులపై ఒత్తిడి తెచ్చి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం. పోర్టుకు ఆనుకుని ఇండోసోల్ కంపెనీ అనుబంధ పరిశ్రమ గుడ్లూరు మండలం చేవూరు, రావూరులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించాం. ఇందుకోసం ఇండోసోల్ కంపెనీతోనే సుమారు రూ.500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూముల్లో ఆ కంపెనీ ఏర్పాటవుతున్న దశలో కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములను వారికి ఇవ్వకుండా కరేడుకు వెళ్లిపొమ్మంది. కరేడులో సారవంతమైన, ఏటా రెండు పంటలు పండే భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది. వాళ్ల కోసం సేకరించిన భూములు వాళ్లకే ఇవ్వడం లేదు.. రైతులను ఒత్తిడి తెచ్చి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. రైతులకు ఆ భూములు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందేనని బలవంతం చేస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇండోసోల్ కి కేటాయించిన భూములను బీపీసీఎల్ కు ఇచ్చి, ఇండోసోల్ కు పొగ పెట్టి పొమ్మంటోంది. బీపీసీఎల్ కు ఇవ్వాలనుకుంటే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూములు సరిపడా ఉన్నాయి. అలా చేయకుండా రైతులకు ఏమాత్రం ఇష్టం లేని భూములు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం వివాదం రాజేసింది. ఇది ముమ్మాటికీ కుట్రే. సారవంతమైన భూములు కోల్పోతామని కరేడు రైతులు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండోసోల్ సొంత ఖర్చుతో ప్రభుత్వం సేకరించిన భూములను వారికి ఇవ్వకుండా, మరోచోటుకు వెళ్లమనడం పరిశ్రమలను తరిమేసే కుట్రే అవుతుంది. చంద్రబాబుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం లేదు. పరిశ్రమలను పెట్టే వారిని బెదిరించి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. కరేడు రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది” అని హామీ ఇచ్చారు. ప్రజల కష్టకాలంలో ఎల్లప్పుడూ వారి వెంటే నిలిచేది వైఎస్సార్సీపీనే అని గుర్తుచేశారు. అన్నదాతకు భరోసా నిధులు అందించాలంటూ పార్టీ తరఫున ధర్నా నిర్వహించామని, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ యువజన పోరాటం చేపట్టామని జగన్ పేర్కొన్నారు. తన పార్టీని అణచివేయాలనే కుట్రలో చంద్రబాబు ఉన్నారని, అధికారులపై నకిలీ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. డీజీ స్థాయి అధికారులకైనా విరామం లేకుండా వేధింపులు జరుగుతున్నాయని జగన్ తెలిపారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసాలను వెలికితీసే ఉద్దేశంతో “వెన్నుపోటు దినోత్సవం” నిర్వహించామని, బాబు గ్యారంటీ అంటే మోసమే అన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.