పొత్తుల పై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు, పవన్ కళ్యాణ్
అమరావతి,మన సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాల చేస్తోందని… అన్ని పార్టీలతో కలిసి మూకుమ్మడిగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. విశాఖ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచారు చంద్రబాబు. చంద్రబాబుకు టెలిఫోన్‌లో మద్దతు తెలిపాక.. నేరుగా వచ్చి సంఘీభావం చెప్పడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీతో రాష్ట్రమంతటా ఒకటే చర్చ.. రెండు పార్టీలు కలిసిపోయాయన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. ఐతే విశాఖలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు దుర్మార్గమని, విశాఖ ఘటనపై పవన్ కు సంఘీభావం తెలిపేందుకు వచ్చాననీ అన్నారు. నాగరిక ప్రపంచంలో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని, విశాఖలో పవన్ కార్యక్రమాన్ని రాద్ధాంతం చేశారని, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ విశాఖ వెళ్లారని, పవన్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారాని పేర్కొన్నారు.

తమపై దాడి చేస్తూ తమ వాళ్లపైనే కేసులు పెడతున్నారని, పవన్ విశాఖ నుంచి వెళ్లిపోయే వరకు ఎంత వేధించాలో అంత వేధించారని ఇదెక్కడి ప్రజాస్వామ్యమని దుయ్యబట్టారు. ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసమే ఇలా చేస్తున్నారని… విశాఖ వెళ్లడానికి పవన్ కల్యాణ్ కు అర్హత లేదా? అని ప్రశ్నించారు. పవన్ విశాఖలో ఉంటే ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని,రాజకీయ నాయకులకే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఎక్కడన్నారు. దాడులు చేయడం, కేసులు పెట్టడం, జైల్లో వేయడం మూడున్నరేళ్లుగా ఇదే జరుగుతోందని అన్నారు. వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని… 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నాని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు, మీడియాకు.. చివరకు ప్రజలకు కూడా రక్షణ లేదనికొందరు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏపీలో ఉందని తన మనసుకు బాధనిపించి.. సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు చంద్రబాబు.

ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాంమన్న చంద్రబాబు… అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమన్నారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు అందరూ కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైకో పాలనలో ఇంట్లోంచి బయటకు రావాలంటే.. ప్రతిఒక్కరూ భయపడుతున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుందని అన్నారు. ప్రభుత్వ వేధింపులను నేనే భరించలేకపోయాననీ ఇప్పుడు పవన్ వంతు వచ్చిందని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే హితులంతా కలిసి రావాలని కోరారు చంద్రబాబు. రఘురామపై దాడి జరిగితే మొదట తానే స్పందించానన్న ఆయన… ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు పోరాటం తప్ప గత్యంతరం లేదన్నారు. ఐతే ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదని… ముందు నిర్బంధం అంతం కావాలన్నారు. మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తులపై నేరుగా స్పందించలేదు. తొలుత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని… ఆ తర్వాత ఏ పార్టీ ఎలా పోటీ చేస్తుందో నిర్ణయించుకుంటాయని వెల్లడించారు. మరి టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడుస్తున్న లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

