సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం: రెపో రేటు 6.50% గా కొనసాగింపు…..!
ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షను నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ నిర్ణయాలను తీసుకున్న ఆర్‌బీఐ, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేటును 6.50% వద్ద కొనసాగించాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇది 2023 ఫిబ్రవరి నుండి వరుసగా 11వసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం. ఆర్‌బీఐ మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 4.50% నుంచి 4%కి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతుంది, దీంతో బ్యాంకులు వృద్ధిని వేగవంతం చేయడానికి ఎక్కువ రుణాలను అందించగలవని భావిస్తున్నారు. ఈ మార్పుతో ఆర్‌బీఐకి రూ. 1.16 లక్షల కోట్ల నగదు అదనంగా అందుబాటులోకి వస్తుంది.

