రాష్ట్రాలకు కేంద్రం అత్యవసర ఆదేశాలు
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వ హోంశాఖ అత్యవసరంగా పలు కీలక ఆదేశాలు జారీచేసింది. పాక్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారత భద్రత గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి తప్పుడ కథనాలు వ్యాప్తి చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించవద్దని పేర్కొన్నారు. అలాంటి సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. అలాగే పాక్ సరిహద్దు ప్రాంతాల ప్రభుత్వాలకు, భద్రతా దళాలకు మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు పెంచాలని పిలుపునిచ్చారు. అలాగే పంజాబ్, రాజస్థాన్‌లలో పాక్ సరిహద్దులను పూర్తిగా సీల్ చేశారు. రాజస్థాన్‌లోని 1,037 కిలోమీటర్ల మేర పాక్ సరిహద్దు వ్యాపించి ఉంది. సరిహద్దు ప్రాంతాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి వారిని అక్కడ నుండి తరలిస్తున్నారు.


