పులిని పొడిచి, చంపేసిన గేదెలు
‘ఐకమత్యమే మహాబలం’. ఇది చిన్నప్పుడు అందరూ చదువుకునే ఉంటారు. ఈ విషయాన్ని మానవులు పాటించకపోయినా నోరులేని జీవులు అర్థం చేసుకున్నాయి. మూకుమ్మడిగా దాడి చేసి, కొమ్ములతో పొడిచి ఒక పులినే చంపేశాయి కొన్ని గేదెలు. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో జరిగింది. మూల్ తాలూకాలోని ఎస్ గావ్ అనే గ్రామానికి దగ్గరలో తొలుత ఒక పశువుల కాపరిపై దాడికి ప్రయత్నించింది ఒక పులి. చేతిలోని గొడ్డలితో ఎదురు తిరిగి బెదిరించడంతో పారిపోయింది. తర్వాత బెంబాడా అనే గ్రామంలో పచ్చిక మేస్తున్న ఆవులు, గేదెలపై దాడి చేసింది. దీనితో భయపడకుండా ఎదురు తిరిగిన గేదెలు తమ వాడి కొమ్ములతో పులిని పొడిచాయి. దీనితో ఆ పులి తీవ్రంగా గాయపడింది. ఇదంతా కాస్త దూరంలో ఉన్న పశువుల కాపరులు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా, దానిని చికిత్స కోసం చంద్రపూర్ తరలించారు. చికిత్స పొందుతూ పులి అదేరోజు రాత్రి చనిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఐకమత్యం మహాబలమైనదేనని ఒప్పుకుని తీరవలసిందే.


 
							 
							