స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్‌కుమార్ రెడ్డి ఉన్నారు.
వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై వాస్తవాలను ప్రజల ముందుంచడం తమ బాధ్యత అని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొద్దికాలంగా అనేక రకాల అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయని వారు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం, సాంకేతిక వివరాలు, రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, వివిధ దశలలో జరిగిన పనులపై సమగ్ర వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ వివరాలు సమగ్రంగా చెప్పాలని తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
కేంద్రంపై ఆరోపణలు
పక్కరాష్ట్రం బనకచర్ల పేరుతోనూ, గోదావరి–కావేరి లింక్ పేరిట తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును రక్షించుకోవడం రాష్ట్రానికి అత్యంత అవసరమని వారు తెలిపారు.
ప్రతిపక్షానికి హక్కు కాపాడాలి
గతంలో ప్రభుత్వం శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భం ఉందని, అదే తరహాలో ప్రతిపక్షానికీ అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, పీపీటీ ద్వారా వాస్తవాలు ప్రజల ముందుంచే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.