Home Page SliderInternational

ట్రంప్‌కు కలిసొచ్చిన అదృష్టం..వచ్చి పడిన వేల కోట్ల సంపద

Share with

అమెరికా ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆయన జీవితంలోనే ఎన్నడూ లేనంత సంపద వచ్చి పడి ప్రపంచ కుబేరుల లిస్టులో చేరిపోయారు. మరోపక్క ఆయనను తీవ్ర అలజడికి గురిచేసిన కోర్టు కేసులో ఊరట లభించింది. ఆయనకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో వేసిన అప్పీలులో ఊరట లభించింది. తన సంపద గురించి అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు విధించిన 45.4 కోట్ల డాలర్లు ( రూ. 3,788 కోట్లు) భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు ట్రంప్. దీనితో న్యూయార్క్ కోర్టు పది రోజులలో 17.5 కోట్ల డాలర్లు ( రూ. 1,460 కోట్లు) చెల్లిస్తే మిగిలిన మొత్తం వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలియజేసింది. మరోపక్క 29 నెలలుగా సాగుతున్న ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్‌తో విలీనం ప్రక్రియ కూడా పూర్తయ్యింది. దీనితో ట్రంప్ సంపద భారీగా పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదని యూఎస్‌ఏ టుడే పేర్కొంది. ఈ విలీనం అనంతరం కొత్త కంపెనీ నాస్‌డాక్‌లో టీజేటీ పేరిట ట్రేడింగ్ జరగనుంది. దీనిలో ట్రంప్ తన వాటాలను ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాలి.