అక్కడి గాలి పీలిస్తే రోజుకు 50 సిగరెట్లు తాగినట్లే..
దేశ రాజధానిగా ఇంకా ఢిల్లీని కొనసాగించడం అవసరమా అన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలపై ఎంతో నిజం ఉందని, ఢిల్లీలోని గాలి అంత కాలుష్యంగా తయారయ్యిందని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఐఏక్యూ 500 పాయింట్లు దాటడం అంటే సాధారణ ప్రమాదకరమైన స్థాయిని దాటి తీవ్ర స్థాయిలో అక్కడ వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. అక్కడి గాలిని పీలిస్తే ఒక సాధారణ మానవుడు రోజుకు దాదాపు 50 సిగరెట్లు తాగిన వాడితో సమానమైన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. వీటివల్ల శ్వాసకోశ సంబధమైన భయంకర వ్యాధులు చుట్టుముడతాయని, ఇన్‌ఫ్లమేటరీ లంగ్స్ డిసీజెస్ వస్తాయని పేర్కొన్నారు. అక్కడి గాలిలో కలిసి ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ వంటి వాయువులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వీటివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ వాయువులు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే వారిని ఇళ్లలోంచి బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో కూడా మాస్క్ వాడడం తప్పనిసరి.

