Andhra PradeshcrimeHome Page SliderNews AlertPolitics

తిరుపతి జిల్లాలో వెట్టిచాకిరీ కలకలం..బాలుడు మృతి

తిరుపతి జిల్లా సత్యవేడులో 9 ఏళ్ల బాలుడిని వెట్టిచాకిరీ కారణంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. బాలుడి మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. బాతులు మేపే పని కోసం చవటపాలెంకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ తన తొమ్మిదేళ్ల కుమారుడిని సత్యవేడుకు చెందిన బాతుల వ్యాపారి ముత్తు వద్ద తాకట్టు వస్తువుగా పెట్టింది. బాలుడి చేత వెట్టి చాకిరీ చేయించుకున్న ఆ కుటుంబం ఆమె అప్పు తీర్చడానికి సిద్ధపడినా బాలుడిని అప్పగించలేదు. దీనితో వారి తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి అదృశ్యంపై ఆరా తీసిన పోలీసులు ముత్తు కుటుంబాన్ని విచారించగా, బాలుడు బాతులు మేపే క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడని, కంచిలో వైద్యం చేయించామని, చికిత్స పొందుతూ మృతి చెందాడని, అక్కడే పాతిపెట్టామని చెప్పారు. పోలీసులు కంచికి వెళ్లి ఆసుపత్రిలో విచారించగా, బాలుడు మృతి చెందినట్లు నిర్థారించారు. దీనితో ముత్తు కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని, ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు వెట్టి చాకిరీ కేసును కూడా నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని వెలికితీసి, చంగల్ పట్టు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.