Home Page SliderNational

మాజీ సీఎం మ‌న‌వ‌డితో బాలీవుడ్‌ నటి డేటింగ్.?

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్ ప్ర‌స్తుతం ప్రేమ‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాను ప్రేమించే అబ్బాయి ఎవ‌రో కాదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియా అని స‌మాచారం. జూలై 12న‌ అనంత్ అంబానీ – రాధిక మర్చెంట్‌ల వెడ్డింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఈవెంట్‌లో వీళ్లిద్ద‌రూ క‌లిసి ఉండ‌డం.. క‌లిసి డ్యాన్స్ చేయ‌డం చూస్తుంటే ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ వీడియోలో మానుషి చిల్లర్ – వీర్‌ పహారియా క‌లిసి ఉండ‌డం వీర్‌ భుజంపై తల పెట్టుకొని మానుషి చిల్లర్ సేదతీరుతూ కనిపించడం చూస్తే ఈ వార్త‌లు నిజమే అనిపిస్తున్నాయి.

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరిగా విజయం సాధించింది. అయితే విశ్వ‌సుంద‌రి అయినా సినిమా అవకాశాలు వ‌రుస‌గా ఏం రాలేదు. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ న‌టించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ‌. అనంత‌రం తారిఖ్‌, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడేమియా ఛోటే మియా వంటి సినిమాలు చేసింది. ఇక తెలుగులో వ‌రుణ్ తేజ్ న‌టించిన ఆపరేషన్ వాలెంటైన్‌లో హీరోయిన్‌గా మెరిసింది.