బాలీవుడ్ నటుడి సూసైడ్ కేసు..సీబీఐ ఏం చెప్పింది?
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ తన ఫైనల్ రిపోర్టును సమర్పించింది. ఈ కేసుకు సంబంధించిన క్లోజర్ రిపోర్టును ముంబయి కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఆరోపణలు చేయడంతో సీబీఐ కేసు నమోదయ్యింది. అలాగే రియా చక్రవర్తి కూడా సుశాంత్ కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసు వేశారు. అయితే నాలుగేళ్ల పాటు దర్యాప్తు చేసిన ఈ కేసులో ఎవరిపైనా అభియోగాలు నమోదు కాలేదు. సుశాంత్ మరణంపై అనుమానాలు కలిగేలా ఆధారాలు ఏమీ బయటపడలేదని సీబీఐ పేర్కొంది. సుశాంత్ ముంబయిలోని బాంద్రాలో జూన్ 14న తన నివాసంలోనే సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.

