100 మందితో పడవ బోల్తా.. స్కూల్ విద్యార్థులూ గల్లంతు
అస్సాంలో ఘోర బోటు ప్రమాదం సంభవించింది. ధుబ్రీ జిల్లాలో 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బ్రహ్మపుత్ర నదిలో గురువారం బోల్తా పడింది. బాషానీకి వెళ్తుండగా అడబరి వద్ద బ్రిడ్జి పోస్ట్‌ను ఢీకొట్టడంతో పడవ తిరగబడింది. బోటులో ప్రయాణిస్తున్న వారంతా నదిలో పడిపోయారు. ఓ ప్రభుత్వ అధికారి, స్కూల్ విద్యార్థులు, ఇతర ప్రయాణికులు.. నదిలో గల్లంతైన వారిలో ఉన్నారు. పడవలో 10 మోటార్ సైకిళ్లను ఎక్కించారని.. ప్రమాదానికి అదే కారణమని ప్రయాణికులు అంటున్నారు.

ధుబ్రి సర్కిల్ అధికారి సంజుదాస్, భూమి డాక్యుమెంట్స్ అధికారి, ఆయన కార్యాలయ ఉద్యోగి వరదల్లో కోతకు గురైన ప్రాంతంలో సర్వే చేసేందుకు ఈ బోటులో వెళ్తుండగా నదిలో మునిగిపోయారు. ఎస్డీఆర్ఎప్కు చెందిన గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 15 మందిని రక్షించామని.. స్కూల్ విద్యార్థుల జాడ మాత్రం దొరకలేదని చెప్పారు.