అదానీ కేసుకు, రాహుల్ అనర్హతకు సంబంధమే లేదన్న బీజేపీ
లోక్‌సభలో తను ప్రసంగిస్తే ఏమవుతుందోనన్న భయంతో ప్రధాని నరేంద్ర మోదీ భయపడి… రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడేలా చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. 2019 పరువు నష్టం కేసులో శిక్ష, ఆ తర్వాత అనర్హత ఆరోపణలపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. అదానీ-హిండెన్‌బర్గ్ రిపోర్టుకు రాహుల్ అనర్హత వ్యవహారానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చించాలని కోరడం వల్లే తనపై వేటు వేశారని రాహుల్ చెప్పడం విడ్డూరమన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్ధాలని, నిరాధారమని అన్నారు.

రాహుల్ గాంధీ అణగారిన వర్గాల ప్రజలను అవమానించారని… రాహుల్‌కు హక్కు ఉన్నట్టే… బాధితుడు కూడా తనకు ఉన్న హక్కుతో కోర్టును ఆశ్రయించాడన్నారు. మోదీ ఇంటిపేరు ఉన్నవారందరూ దొంగలంటూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతారా అని కోర్టు ప్రశ్నించగా, రాహుల్ తిరస్కరించాడని.. అందుకే తీర్పు ఇలా వచ్చిందన్నారు. దొంగలు అంటూ చేసిన వ్యాఖ్యలతో మోదీ కులం ఎంతో బాధపడిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఉద్దేశ్యపూర్వకంగా ఓబీసీలను అవమానించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో యోధానుయోధులైన లాయర్లు ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు స్టే కోరడం లేదని ఆయన విమర్శించారు. సూరత్ కోర్టు తీర్పుపై స్టే కోసం ఎందుకు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కేసులో గంటలోపే సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని… రాహుల్‌గాంధీ కేసుపై ఆ పార్టీ లాయర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా స్టే కోరడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ తన పదవిని త్యాగం చేసినట్లుగా కనిపించడానికి, కర్నాటకలో లబ్ధి పొందేందుకు ఇది ప్రణాళికాబద్ధమైన వ్యూహమని విమర్శించారు. కేవలం గాంధీ మాత్రమే అనర్హులుగా ప్రకటించబడలేదని… దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన ఆరుగురితో సహా మరో 32 మంది అనర్హులు అయ్యారని ఆయన చెప్పారు.