Home Page SliderNational

కర్నాటక ఓటమి తర్వాత వ్యూహం మార్చుకుంటున్న బీజేపీ

Share with

కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ చర్చలు జరుపుతోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ కసరత్తు ప్రారంభించింది. మూడు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ సర్కారు ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు కలిసి వస్తాయని పార్టీ భావిస్తోంది. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునేందుకు అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ మల్లగుల్లాలుపడుతోంది. నాలుగు రాష్ట్రాల్లో నాయకత్వ సమస్య, అభ్యర్థులను నిర్ణయించేటప్పుడు కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకోవాలని పార్టీ భావిస్తోందని, పార్టీ సీనియర్ నాయకులు ఆఫ్ ద రికార్డ్‌గా చెబుతున్నారు. బీఎస్ యడ్యూరప్పను సీఎంగా తప్పించడం, జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాడీలకు టిక్కెట్లు నిరాకరించడం వంటి నిర్ణయాలతో లింగాయత్‌లను కాంగ్రెస్ వైపు మళ్లారని పార్టీ భావిస్తోంది. అవసరమైతే, చిన్న పార్టీలతో ఎన్నికల పొత్తులను కూడా ఖరారు చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. కర్నాటకలో హెచ్‌డి కుమారస్వామితో జతకట్టడం వల్ల మరికొన్ని స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

అయితే, అతిపెద్ద మార్పు ఏమిటంటే, కేంద్ర నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రులపై అధికంగా ఆధారపడే బదులు స్థానిక నాయకులపై దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తోంది. స్థానిక నేతలకు పూర్తి బాధ్యతలకు అప్పగిస్తే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ఆ పార్టీ నమ్ముతోంది. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అనుసరించిన వ్యూహాన్ని 4 రాష్ట్రాల్లో అమలు చేయాలని బీజేపీ విశ్వసిస్తోంది. కర్నాటకలో జగదీష్ షెట్టర్ వంటి నేతలకు టికెట్ నిరాకరించడం వల్ల కలిగిన నష్టం ఏంటన్నదానిపై పార్టీ సమీక్షిస్తోంది. ఇది పార్టీపై నెగిటివ్ ప్రభావం చూపించిందని అంచనాకు వచ్చింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఫ్యాక్షన్‌ను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యమని పార్టీ నమ్ముతోంది. నాలుగు రాష్ట్రాల్లో పొత్తులేకపోవడం కూడా పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. మధ్యప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీకి ముఖంగా ఉంటారని, అదే సమయంలో జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, బిడి శర్మ వంటి ఇతర నాయకులు కూడా సీఎం రేసులో ఉన్నారు. 2020లో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి సింధియా బీజేపీలో చేరినప్పటికీ ఆయన పార్టీ విధేయులకు బయటి వ్యక్తిగానే కన్పించారు. దీంతో ఈసారి పలు ఫ్యాక్షన్ల మధ్య విభేదాలు, టికెట్ల పంపిణీని జఠిలంగా మార్చొచ్చు.

రాజస్థాన్‌లో, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే – కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆమె రాజస్థాన్‌లో కీలక నాయకురాలిగా ఉన్నారు. అయితే కిరోరి లాల్ మీనా, గజేంద్ర సింగ్ షెకావత్, సతీష్ పూనియా వంటి వివిధ కుల సమూహాలకు చెందిన రాష్ట్ర నాయకులకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, సీనియర్‌ నేత బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, అరుణ్‌సావోలకు ప్రాధాన్యత ఇవ్వగా, తెలంగాణలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్, కిషన్‌ రెడ్డిలు పార్టీకి కీలకంగా మారారు. రాష్ట్ర నాయకులు విభేదాలను పరిష్కరించుకొని ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని పార్టీ ఆదేశించింది. మాస్ బేస్ ఉన్న సీనియర్ నేతలను కూడా ఎన్నికల వ్యూహాలు రచించాల్సిందిగా పార్టీ పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో పార్టీ, ప్రభుత్వం మెరుగైన సమన్వయం ఉంది. గ్రౌండ్ లెవెల్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమస్యలు పరిష్కారమవుతున్నాయని.. వాగ్దానాలివ్వడం, వ్యూహాలు అమలు చేయడంలో పార్టీ కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ కీలక పాత్ర పోషిస్తుందని పార్టీ భావిస్తోంది.