తెలంగాణాలో బలం పుంజుకున్న బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుందా..? మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే అది నిజమేనని అర్ధమవుతోంది. 2018 ఎన్నికలతో పోలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయంగా ఎదగాలన్న లక్ష్యాన్ని బీజేపీ సాధిస్తుందనే వాతావరణం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ గోషామహల్ నుంచి రాజాసింగ్ మినహా ఎక్కడా విజయం సాధించలేకపోయింది. తర్వాత ఆరు నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, అదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలిచారు. అంటే.. ఆరు నెలల్లోనే బీజేపీ బలం ఒక అసెంబ్లీ నుంచి నాలుగు ఎంపీ స్థానాలకు ఎగబాకింది.

మధ్య తరగతి, పేద ప్రజల మనస్సుల్లోకి బీజేపీ..
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. కరీంనగర్, నిజామాబాద్, జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోనూ గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మునుగోడులో ఓడిపోయినా ఓట్లు మాత్రం భారీ స్థాయిలో సాధించగలిగింది. వీటన్నింటినీ విశ్లేషిస్తే రాష్ట్రంలోని మధ్య తరగతి, పేద ప్రజల మనస్సుల్లోకి బీజేపీ చొచ్చుకుపోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు.. టీఆర్‌ఎస్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకున్నా ఆశ్చర్యం లేదని కొందరు వాదిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి వలసలు తప్పవా..
ఇక కాంగ్రెస్‌ను రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులే అంతం చేసే పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని సీనియర్ నాయకులే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తూ అధ:పాతాళానికి తొక్కేస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఠా కొట్లాటల్లో మునిగిపోయిన కాంగ్రెస్ నాయకులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచించే తీరికే కనిపించడం లేదు. పార్టీలోనే ఉంటూ.. పార్టీకే వెన్నుపోటు పొడిచే వాళ్లు చాలా మందే ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల కోసం పార్టీని అంతమొందిస్తున్నారు. గెలిచిన వాళ్లు కూడా ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తుండటంతో సామాన్య ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోయింది. రోజురోజుకూ దిగజారుతున్న ఓటింగ్ శాతమే దీనికి నిదర్శనం. ఆ ఓట్లను బీజేపీ తన వైపునకు తిప్పుకుంటూ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి భారీ వలసలు పెరిగినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.