Home Page Sliderhome page sliderInternational

మదురో అరెస్టుపై రూ.3 కోట్ల బెట్టింగ్

అమెరికా సైన్యంలో పనిచేస్తూ, అత్యంత రహస్యంగా సాగాల్సిన సైనిక ఆపరేషన్‌ వివరాలను తన స్వలాభం కోసం వాడుకున్న ఒక సైనికుడి ఉదంతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో నిర్బంధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ముందే పసిగట్టిన సదరు సైనికుడు, ప్రిడిక్షన్ మార్కెట్‌లో పందెం కాసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా గెలుచుకున్నాడు. ఈ ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ వ్యవహారం బయటపడటంతో అమెరికా అధికారులు అతడిని కటకటాల్లోకి నెట్టారు. ఒక సైనికుడే దేశ రహస్యాలను బెట్టింగ్ కోసం వాడటం సంచలనంగా మారింది.

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను నిర్బంధించడానికి అమెరికా సైన్యం ఈ ఏడాది జనవరిలో ‘ఆపరేషన్‌ ఆబ్జల్యూట్‌ రిజాల్వ్‌’ పేరుతో ఒక మెరుపు దాడిని నిర్వహించింది. ఈ ఆపరేషన్ కోసం డిసెంబరు నుంచే అత్యంత రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మిషన్‌లో పాల్గొన్న అమెరికా సైనికుడు గ్యానన్‌ కెన్‌ వాన్‌ డైక్‌కు మదురో ఎప్పుడు, ఎలా అదుపులోకి వస్తారనే కీలక సమాచారం ముందే తెలిసింది. దేశభక్తిని పక్కనపెట్టి, ఆ రహస్య సమాచారాన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన డైక్.. ‘పాలీమార్కెట్‌’ అనే వెబ్‌సైట్‌లో మదురో నిర్బంధంపై భారీ స్థాయిలో బెట్టింగ్ కాశాడు. అనుకున్నట్టుగానే ఆపరేషన్ విజయవంతం కావడంతో, అతడు సుమారు 4 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.3 కోట్లకు పైగా) గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆ సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి మళ్లించాడు. ఈ అసాధారణ లావాదేవీలపై నిఘా ఉంచిన అధికారులు లోతుగా విచారణ జరపడంతో డైక్ అసలు రంగు బయటపడింది. అధికారిక రహస్యాలను బెట్టింగ్ కోసం వినియోగించడం, ఆర్థిక అక్రమాలకు పాల్పడటం వంటి తీవ్రమైన నేరాల కింద అతడిపై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.