ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు… హైకోర్టు సంచలన తీర్పు
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ విద్యార్హత ఉన్న అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంటూ, ఏపీ హైకోర్టు స్టే విధించింది. బీఈడీ విద్యార్హత ఉన్న అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించవద్దని చీఫ్ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతిస్తే డిఎడ్ విద్యార్హత ఉన్న లక్షలాది మంది అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతుందని పిటిషన్ జడ శ్రావణ్ కుమార్ వాదనలు విన్పించారు. ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్‌లో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లోని 6,100 టీచర్ల పోస్టుల భర్తీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ‘మెగా డీఎస్సీ’ ఉద్యోగ నోటిఫికేషన్‌పై జీవో నెం.11ని హైకోర్టు పక్కనబెట్టేసింది. కేసు విచారణను కోర్టు ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత ప్రమాణాలకు సవరణలు చేస్తుందని ఆయన కోర్టుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలతో ఏకీభవించింది.