బాబు పాలనంతా అన్యాయమే
- న్యాయవాదుల సేవల్ని పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది
- ప్రభుత్వ దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు
- అమరావతిలో అవినీతి ఓ శిఖర స్థాయికి చేరింది
- జగన్ 2.0 లో పార్టీకి పని చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది
- న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్రంలో న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించకుండా పోయిందని, ఇప్పుడు ఏపీలో కలియుగ రాజకీయాలే జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడుతూ, చంద్రబాబు పాలనలో అక్రమ కేసులు, తప్పుడు సాక్ష్యాలతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు.మంగళవారం తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని జగన్ ప్రశంసించారు. తప్పుడు కేసులు, బెదిరింపులు, ప్రలోభాలతో ప్రజలను వేధిస్తున్న పరిస్థితుల్లో న్యాయవాదులు బాధితుల తరఫున నిలవాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. పార్టీకి మీరు తోడుగా, పెద్దన్నగా నిలుస్తున్నారు. మీరు పిటిషన్ వేయకపోతే న్యాయం కూడా జరగదు అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దుష్ప్రచారం, అవినీతి, మోసాలతో నడుస్తోందని జగన్ ఆరోపించారు. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ధ్వంసమైంది. పురోగతి, అభివృద్ధి కనిపించడంలేదు. పోలీసుల సహకారంతో పేకాట క్లబ్బులు, బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఉచిత ఇసుక పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం నాశనమవుతోంది అని వ్యాఖ్యానించారు. అమరావతిలో చదరపు అడుగుకి రూ.4 వేలు ఖర్చు చేస్తే ఫైవ్‌స్టార్ సదుపాయాలు వస్తాయని ప్రచారం చేస్తూ అసలు ఖర్చును రూ.10 వేలకు పెంచారని ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట భారీ కమీషన్లు వసూలు చేస్తున్నారని, మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడిపేందుకు కూడా కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు.పార్టీకోసం నిజంగా పని చేసే వారికి ప్రాధాన్యత ఉంటుంది. డేటాబేస్ రూపొందిస్తున్నాం. త్వరలో యాప్ కూడా విడుదల చేస్తాం. ఎక్కడైనా అన్యాయం జరిగితే, ప్రజలు ఆధారాలు, సాక్ష్యాలను అందులో అప్లోడ్ చేయొచ్చు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తప్పవు’’ అని హామీ ఇచ్చారు.మా ప్రభుత్వ హయాంలో లా నేస్తం కార్యక్రమం ద్వారా న్యాయవాదులకు అండగా నిలిచాం. జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాం. సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించాం. ఇన్సూరెన్స్ నిధిలో 1/3 భాగం ప్రభుత్వం భరించింది. కానీ ఇప్పటి ప్రభుత్వం న్యాయవాదులను కూడా మోసం చేస్తోంది అని అన్నారు.న్యాయం కోసం పోరాటం చేయాలి. బాధితుల పక్షాన నిలవాలి. పార్టీ కోసం పని చేసిన వారిని మేము మరువం. ఈ పోరాటంలో ప్రతి న్యాయవాది భాగస్వామిగా ఉండాలి అని జగన్ పిలుపునిచ్చారు.

