దేశవ్యాప్తంగా 29 వేల ఆసుపత్రులతో “ఆయుష్మాన్ భారత్”
దేశవ్యాప్తంగా 12,625 ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు మొత్తంగా 29 వేల ఆసుపత్రులను ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా నేడు పార్లమెంటులో ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర హెల్త్ ఏజెన్సీలతో కూడా ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఈ ఆసుపత్రులన్నీ ఎమ్‌ఓయూలపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద లబ్దిదారులు నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స తీసుకోవచ్చు. ఆ ఆసుపత్రులు స్పందించకపోతే ఆయా రాష్ట్ర ఏజెన్సీల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. వాటిపై సమీక్షించి, వారిని డీప్యానెల్ చేయడంతో సహా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను పెంచే అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వివిధ రాష్ట్రాలలో ఎంప్యానెల్ అయిన ఆసుపత్రుల సంఖ్యలను ఈ సందర్భంగా తెలియజేశారు.