మూగ మహిళపై సామూహిక అత్యాచార యత్నం
నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణ సంఘటన జరిగింది. మూగ మహిళ అని కూడా చూడకుండా ముగ్గురు దుర్మార్గులు ఒక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారు. కందుకూరులోని మాచవరం రోడ్డులో ఒక మూగ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. దీనితో ఆమె పరుగున వెళ్లి దగ్గరలోని పెట్రోల్ బంకును చేరుకుంది. వారు ఆమెను రక్షించి, పోలీసులకు సమాచారమిచ్చారు. దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై అత్యాచార యత్నంతో పాటు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. వీరిలో ఒకరు ఆటోడ్రైవర్, మరో ఇద్దరు కందుకూరులో గూర్ఖాలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.