భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాం
భారీ వర్షాలు, వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం వరద ముంచెత్తుతోంది. దీనితో వరద ప్రాంతాలలోని ప్రజలను సహాయ కేంద్రాలకు తీసుకువెళ్తున్నారు. ఈ రాష్ట్రంలోని 19 జిల్లాలలో వరద ప్రభావం అధికంగా ఉంది. సుమారు 5 లక్షల మంది ఈ కారణంగా అవస్తలు పడుతున్నారు. భారీ వరద కారణంగా నల్చరి జిల్లాలో ఒకరు, తాముల్పూర్ జిల్లాలో ఒకరు మరణించారు. దాదాపు 1600 గ్రామాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. బజాలి, బర్పేట అనే జిల్లాలలో వరద పరిస్థితి బీభత్సంగా ఉంది. ప్రభుత్వం ముందుగానే సహాయ చర్యలు,ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. సుమారు 225 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, దాదాపు 35 మందికి ఆశ్రయం కల్పించింది. వారికి ఆహారం, మందులు అందజేస్తున్నారు. సుమారు 10 వేల హెక్టార్ల భూమిలో పంటలు నీటిలో మునిగిపోయాయి. అనేక ఇళ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు ఈ వర్షాల కారణంగా ధ్వంసమయ్యాయి. అనేక రహదారులలో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రహ్మపుత్ర, మానస వంటి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.