Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో మార్పుకు సంకేతమా ?

• మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం కైవసం
• 108 నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రుల ఫలితాలు
• భారీ జోష్ లో చంద్రబాబు
• ఓటమి దెబ్బతో వైయస్సార్సీపీలో ఆందోళన
• సెమీఫైనల్స్ గానే పరిగణిస్తున్న రాజకీయ వర్గాలు

ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికి సరిగ్గా ఏడాది ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు ఇందులో ఓటు వేశారు. సుమారుగా 7.5 లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని తమ తీర్పు ఇచ్చారు. సాధారణ ఎన్నికల ముందు ఇంత విస్తృత స్థాయిలో జరిగే ఎన్నికలు ఇక లేవు. దీంతో పట్టభద్ర ఎన్నికలను సెమీఫైనల్స్ గానే చూడాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వైయస్సార్సీపీ తెలుగుదేశం పార్టీలు నేరుగా తమ అభ్యర్థులను రంగంలోకి దించి శక్తి వంచన లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోరాడాయి. అధికార పార్టీ సహజంగా తమకు అందుబాటులో ఉండే సమస్త వనరులను ధారపోసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు రాయలసీమలోని నాలుగు జిల్లాలు రాయలసీమకు ఆనుకొని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పట్టభద్రులు ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ తమకు గట్టి పట్టు ఉన్న ప్రాంతాలుగా వైఎస్సార్సీపీ నాయకత్వం భావిస్తుంది. ప్రత్యేకించి రాయలసీమలోని 58 అసెంబ్లీ సీట్లలో పోయినసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు మాత్రమే దక్కాయి అలాంటి రాయలసీమలోని రెండు పట్టభద్ర స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం మార్పుకు సంకేతమా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారుగా మూడున్నర ఏళ్ళు దాటింది. ఆ ప్రభుత్వం పై గతేడాది నుంచి కొంతమేర వ్యతిరేకత మొదలైంది. కానీ ఈ విషయంపై ఎవరైనా వైయస్సార్సీపీ నేతల ముందు ప్రభుత్వ వ్యతిరేకతపై మాట్లాడితే ఎవరికీ వ్యతిరేకత, ఎందుకు వ్యతిరేకత ,అలా మాట్లాడిన వారు పచ్చి తెలుగుదేశం పార్టీ వాదులు అసలు సీఎం జగన్ పై వ్యతిరేకత లేదని ఈసారి 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సీపీ విజయకేతనం ఎగురువేయటం ఖాయమని ఒక స్థాయి నాయకులు వాదిస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు మూడు పట్టభద్రుల స్థానాలలో ఓడిపోయిన వైఎస్ఆర్సిపీపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. శాసనమండలి ఎన్నికలు ప్రజాస్వామ్య పరిధిలోకి రావా, ఒకవేళ వస్తే వారికి ఓట్లు వేసింది రాష్ట్రంలో ఉండే మనుషులు కారా, ఈ విషయాలు నిజమైతే మరి అంగ బలం ఆర్థిక బలం కలిగిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులును ఎందుకు గెలిపించుకోలేకపోయింది అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ బాధ్యతగా తమ పరిధిలో అంగ బలం ఆర్థిక బలాలను ఉపయోగించిన కూడా వాలంటీర్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు విజయం కోసం అంకితభావంతో కృషి చేసిన కూడా వైఎస్ఆర్సిపీ అభ్యర్థులు ఓడిపోవడం దేనికి సంకేతం అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఆత్మస్థైర్యం పెరిగినట్లు అయింది.

2019 ఎన్నికల తర్వాత అధికార పార్టీ తీరు ముందు తోక ముడుచుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఎన్నికలలో గెలుపొందాక కాలర్ ఎగరవేస్తున్నాయి. శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో సైకిల్ రోడ్ ఎక్కింది. నిన్నటి దాకా కిమ్మనకుండా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా కేరింతలు కొడుతున్నారు. ఎక్కడ చూసినా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పంచరైన సైకిల్ రిపేరు చేయించి రానున్న సార్వత్రిక ఎన్నికల సవారీకి సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు సెమీఫైనల్స్ గా భావిస్తూ రానున్న ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని దీమాను వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ఊహించని పరిణామాలతో మూడు పట్టబద్ధుల ఎన్నికల స్థానాల్లో ఓడిపోయిన వైఎస్ఆర్సిపీ మౌనరోధనలో ఉంది. ఓటమికి గల కారణాలను ఆ పార్టీ విశ్లేషించుకుంటోంది. ఈనెల 23వ తేదీ జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చీలకుండా అధికార పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు స్థానాల్లో అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగలడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను జగన్ సీరియస్‌గా తీసుకొని మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి అధికార పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బని… ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.