బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రులు
ఏపీలోని సచివాలయం కొత్త మంత్రుల రాకతో కళకళలాడుతోంది. గత రెండు రోజుల నుంచి ఏపీ మంత్రులంతా ఒక్కొక్కరిగా బాధ్యతలు చేపడుతున్నారు.కాగా నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అలానే పంచాయితీరాజ్, పర్యావరణ, గ్రామీణాభివృధ్ది, త్రాగునీటి సరఫరా,అడవులు,సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు వంగలపూడి అనిత కూడా నిన్న హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సచివాలయంలో ఏపీ జలవనరుల శాఖమంత్రిగా నిమ్మల రామానాయుడు, కార్మికశాఖమంత్రిగా వాసంశెట్టి సుభాష్,పరిశ్రమల శాఖమంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. కాగా వైసీపీ వల్లే ఏపీలో పోలవరం నిర్మాణం ఆలస్యమైందని నిమ్మల దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రంలోని కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని మంత్రి వాసంశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.