బర్రెలక్క, పవన్ కల్యాణ్ మధ్యలో జగన్!
“కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం” అన్నారు శ్రీశ్రీ. అవును కవిత ఎలాగైనా వేయొచ్చు. ఏ విధంగానైనా చెప్పొచ్చు. విమర్శ, దెప్పిపొడుపు కూడా అంతే! ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందనేగా మీ డౌట్. యూ ఆర్ రైట్… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత, తన ట్రేడ్ మార్క్ విమర్శను మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై గుప్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, తనను మోస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు జగన్. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మ్యారేజ్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయనను… ఆంధ్రా వ్యతిరేకి, ఆంధ్ర ద్వేషి అంటూ దుయ్యబట్టారు.
అంతేకాదు తెలంగాణ ఎన్నికల కోసం ఆంధ్రాను పరువు నడిరోడ్డుపై తీశారని మండిపడ్డారు. తెలంగాణలో పుట్టనందుకు బాధపడే వ్యక్తి అసలు మనకు అవసరమా అంటూ సెటైర్లు వేశారు. నాన్ లోకల్ ప్యాకేజి స్టార్, మ్యారేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దానం సాక్షిగా కేలికారు. మాటల మంటలతో అటు టీడీపీ-జనసేన కూటమిపై వేడి పుట్టించారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల సమయంలో సంచలనం రేకెత్తించిన బర్రెలక్కతో పోల్చినప్పుడు ఎందుకూ పనికిరారన్న భావనను వ్యక్తం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ నిలబెట్టిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని మండిపడ్డారు. అంతేకాదు బర్రెలక్కకు వచ్చిన ఓట్లను పోల్చి, జనసేన అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయన్న సెన్సును వివరించారు. మొత్తంగా బర్రెలక్కకు, జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేసిన జగన్… అంతిమంగా ఆంధ్ర ప్రయోజనాలను పరిరక్షించేది తాను మాత్రమేనని వివరించారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడతారని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఉద్దానం ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించడంతోపాటుగా, కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్, నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుని ఒప్పించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రయత్నించారు. కానీ ఐదేళ్లు గడిచిన అది కార్యరూపం దాల్చలేదు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా నాలుగున్నరేళ్లు దాటిన తర్వాత, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తనను తాను సమస్యల పరిష్కార సారధిగా… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దానం సాక్షిగా, జగన్ చెడుగుడాడుకున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు తాను శాశ్వత పరిష్కారం అందించానని… వైయస్సార్ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంతోపాటుగా, సుజలధార ప్రాజెక్టును 785 కోట్ల రూపాయలతో శాశ్వతపరిష్కారం చూపించానని జగన్ చెప్పుకొచ్చారు.