Andhra PradeshHome Page Slider

జూన్ 4 ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా సమీక్ష

Share with

ఏపీలో ఈనెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా. వచ్చే నెల 4న చేపట్టనున్న కౌంటింగ్ కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఫలితాలను వేగంగా, లోపభుయిష్టంగా ఇవ్వాలని సూచించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రత విషయంలో రాజీపడొద్దన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు అవకాశమివ్వొద్దని ఆదేశించారు. ముందుగానే ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేస్తుందీ, ఎన్ని రౌండ్లన్న విషయాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారాన్ని వేగంగా చేరవేయాలన్నారు. కౌంటింగ్ లెక్కలను అభ్యర్థులు, ఏజెంట్లకు వెల్లడించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంల తరలింపు మార్గంతోపాటుగా, అభ్యర్థులు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను సూచించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ కౌంటింగ్‌కు అనుగుణంగా టేబుళ్లుండాలన్నారు. ఫలితాలను ఈసీ ఎన్‌కోర్ వెబ్ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు నివేదించాలని, అనధికార వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించరాదని పేర్కొన్నారు సీఈవో మీనా. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలన్నారు.