రన్యారావుకు మరో షాక్..
దుబాయి నుండి అక్రమ బంగారం తరలింపు కేసులో అరెస్టయిన రన్యారావుకు ఫ్యామిలీ నుండి మరో షాక్ తగిలింది. ఆమె భర్త జతిన్ హుక్కురి తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. వివాహమై 4 నెలలు గడవకముందే ఆమె స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడం, అరెస్టు కావడం వంటి సంఘటనలతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వివాహ బ్రోకర్ ద్వారా 2024 నవంబర్ 27న వీరి వివాహం జరిగింది. ల్యావెల్లీ రోడ్డులోని ఒక ఖరీదైన అపార్టమెంట్లో వీరిద్దరూ ఉంటున్నారు. వ్యాపారం పేరుతో ఆమె వద్దన్నా వినకుండా విదేశీ ప్రయాణాలు చేయడంతో నెలరోజులు కూడా గడవకముందే జతిన్ ఆమెకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తన స్నేహితుడు తరుణ్‌తో కలిసి ఆమె చేస్తున్న అక్రమ వ్యాపారం మార్చి2న ఆమెను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన అనంతరం బయటపడింది. ఆమె భర్త ప్రమేయం కూడా ఉందేమో అనే అనుమానంతో ఆయనను కూడా విచారించారు అధికారులు. అయితే బంగారం స్మగ్లింగ్ విషయంలో ఆయన పాత్ర లేకపోవడంతో కేసు నుండి బయటపడ్డారు. దీనితో ఇక వివాహ బంధాన్ని కొనసాగించలేనంటూ విడాకులకు అర్జీ పెట్టుకున్నారు జతిన్.