Home Page SliderInternational

ఉక్రెయిన్‌పై మరోమారు రష్యా క్షిపణి ప్రయోగం- భారీ నష్టం

ఉక్రెయిన్‌పై వీలు దొరికినప్పుడల్లా రష్యా దాడిని కొనసాగిస్తోంది. సోమవారం అర్థరాత్రి ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరమైన క్రైవీ రిహ్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణి దాడిలో ఐదంతస్తుల భవనం, మరికొన్ని ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. ఈ దాడికి గురైన భవనం ఇప్పటికీ అగ్నికీలలలోనే ఉంది. అధికారిక లెక్కలప్రకారం ముగ్గురు మరణించారని, 25 మంది గాయపడ్డారని గవర్నర్ తెలియజేశారు. భవన శిథిలాల కింద ఎంతమంది ఉన్నారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కూడా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు పలు నగరాలలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. సాధారణ పౌరులపై రష్యా హంతకులు యుద్ధం ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. దీనికి కారణమయిన వారు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.