NewsTelangana

ఈటల ఇంటికి అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పరామర్శించారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకల తర్వాత శామీర్‌పేటలోని ఈటల ఇంటికి వెళ్లిన అమిత్‌ షా ఇటీవల మృతి చెందిన ఈటల తండ్రి మలయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈటల ఇంట్లో 15 నిమిషాలు గడిపిన అమిత్‌ షా.. ఈటల సతీమణి జమున, సోదరులు సమ్మయ్య, భద్రయ్య, కుమారుడు నితిన్‌, కోడలు క్షమిత, కూతురు నీత, అల్లుడు అనూప్‌లతో మాట్లాడారు. తెలంగాణాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈటలతో చాలా సేపు చర్చించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారెవరూ ప్రస్తుతం కేసీఆర్‌తో లేరని ఈటల స్పష్టం చేశారు. అంతకుముందు పలువురు తెలంగాణ విమోచన యోధులను ఈటల రాజేందర్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సత్కరించారు.

అమిత్‌ షాను కలిసిన గోపీచంద్‌

అమిత్‌ షాను భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కలిశారు. తెలంగాణాలో ఎలాగైనా అధికారం సాధించాలని కంకణం కట్టుకున్న బీజేపీ ఇక్కడి ప్రముఖులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. అమిత్‌ షా ఇటీవల తెలంగాణాకు వవచ్చినప్పుడు సినీ నటుడు జూనియర్‌ ఎన్టీయార్‌, మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సినీ హీరో నితిన్‌ను కలిశారు. అయితే.. అమిత్‌ షాతో రాజకీయాల గురించి చర్చించలేదని.. క్రీడల అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపైనే చర్చ జరిగిందని గోపీచంద్‌ వివరణ ఇచ్చారు. గోపీచంద్‌ను హైదరాబాద్‌లో కలవడం ఆనందంగా ఉందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.