విలక్షణ నటి అమల అక్కినేని
అమల అక్కినేని మనందరకూ సుపరిచితమైన పేరు. ఏమాత్రం ఆడంబరం లేని సాధారణ వేషధారణతో మామూలు స్త్రీలా ఉండే సెలబ్రిటీ సినీనటి. ‘అన్నీ ఉన్న ఆకు అణగి మణిగి ఉంటుందంటారు’. అమలకు ఈ సామెత నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఈరోజు సెప్టెంబరు 12 ఆమె జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
అమల అంటే ‘అమలినం’ అంటే మలినం కానిది అని అర్థం. పేరుకు తగిన ప్రవర్తనతో స్వచ్ఛమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటుందామె. ఆమె 1967లో సెప్టెంబరు 12 కలకత్తాలో జన్మించారు. ఆమె తండ్రి బెంగాలీ. ఆయన ఇండియన్ నేవీలో పని చేసేవారు. తల్లి ఒక ఐరిష్ మహిళ. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నారు. ఆమె చిన్నతనంలోనే ఆమె కుటుంబం చెన్నైకి వచ్చేశారు. అక్కడ కళాక్షేత్రలో భరతనాట్యం అభ్యసించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారామె. ఈ ప్రదర్శనలు ఆమె జీవితాన్ని మలుపుతిప్పి సినిమాల వైపు తీసుకొచ్చాయి.

ఆమె బహుభాషా కోవిదురాలు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉంది. ‘మైథిలి ఎన్నై కాథలి’ అనే తమిళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ సాధించడమే కాదు, ఫిలింఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. తర్వాత కాలంలో కూడా ఎన్నో మంచి చిత్రాలలో నటించి అవార్డులు, రివార్డులు అందుకుంది. ఆమె దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోలందరితోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. చిరంజీవి, కమల్ హసన్,రజనీకాంత్, నాగార్జున మొదలైన హీరోలతో ఆమె నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.

ముఖ్యంగా నాగార్జునతో నటించిన ‘శివ’, ‘ ప్రేమయుద్ధం’, ‘నిర్ణయం’ వంటి చిత్రాల్లో వారిద్దరూ మంచి జోడీగా పేరుతెచ్చుకున్నారు. కెరీర్ మంచిస్థాయిలో ఉండగానే 1992లో నాగార్జునను ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది అమల.

ఆమెకు జంతుప్రేమ చాలా ఎక్కువ. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ సంస్థను స్థాపించి ఎన్నో జంతువులను ప్రేమగా చూసుకుంటోంది. దీనిని ఇండియాలోనే పెద్ద ఆర్గనైజేషన్‌గా మార్చింది. జంతువులను సంరక్షించడం, వాటికి తగిన ఆరోగ్యసౌకర్యాలను కల్పించడం, ఆపదలో ఉన్న జంతువులను రక్షించడం వంటి పనులతో ఈ బ్లూ క్రాస్ సంస్థ ఎన్నో మంచి పనులను చేస్తోంది.
అంతే కాక భర్త నాగార్జునకు చెందిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిల్మ్ అండ్ మీడియాకు డైరక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఈమధ్య మంచి చిత్రాలల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే అడపా దడపా చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈ దంపతుల కుమారుడు అఖిల్ కూడా హీరోనే.