NationalNews

కాంగ్రెస్‌ పార్టీకి అజయ్‌ మాకెన్‌ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్‌ నేత షాకిచ్చారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు అజయ్‌ మాకెన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. మరో రెండు వారాల్లో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌ రాష్ట్రంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో మాకెన్‌ రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది. 

అయితే.. మాకెన్‌ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు.  కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో గహ్లోత్‌ను బరిలో దించాలని హైకమాండ్‌ భావించింది. దీంతో సచిన్‌ పైలట్‌ను సీఎంను చేస్తే తామంతా రాజీనామా చేస్తామని, గహ్లోత్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. సెప్టెంబర్‌ నెలలో నిర్వహించిన శాసనసభ సమావేశానికి గహ్లోత్‌ వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని మాకెన్‌ హైకమాండ్‌ సూచించారు. కానీ, ఇప్పటి వరకు పార్టీ వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కలత చెందిన మాకెన్‌… రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.