అహ్మదాబాద్ విమాన ప్రమాదం: DVR స్వాధీనం – దర్యాప్తులో కీలక మలుపు
అహ్మదాబాద్, జూన్ 13:గుజరాత్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో కీలక మలుపు తలెత్తింది. ప్రమాదస్థలమైన శిథిలాల మధ్య నుంచి గుజరాత్ (ATS) అధికారులు డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దృష్టికోణంలో అత్యంత కీలకమైన ఈ పరికరాన్ని త్వరలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం విశ్లేషించనుంది.
ప్రమాదానికి కీలక ఆధారాలు ఇచ్చే అవకాశం
ప్రమాద సమయంలో ఏం జరిగింది? పైలట్ నిర్ణయాలు, ప్రయాణికుల పరిస్థితి, కాక్‌పిట్‌కి వెలుపల కనిపించిన దృశ్యాలన్నింటిపై DVR కీలక ఆధారాల్ని అందించగలదు. విమానంలో ఉన్న అనేక కెమెరాల నుంచి ఈ పరికరం వీడియో ఫుటేజ్‌ను సేకరిస్తూ ఉంటుంది. క్యాబిన్లో ప్రయాణికుల కదలికలు, విమానదారుల చర్యలు ఇలా ప్రతి క్షణాన్ని DVR రికార్డ్ చేస్తుంది.
ఇప్పటివరకు 265 మంది మృతి
ఈ ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయం సమీపంలోని మెడికల్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో మరణించిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
DVR – బ్లాక్ బాక్స్‌తో సమాన ప్రాధాన్యత
విమాన భద్రతలో రెండు ప్రధాన పరికరాలు — బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా & కాక్‌పిట్ వాయిస్ రికార్డర్), మరియు DVR. DVR వీడియో ఆధారాలను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది సంఘటనకు ముందు, తర్వాత జరిగిన ప్రతి పరిణామాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది. అటు బ్లాక్ బాక్స్ ధ్వనితో పాటు ఫ్లైట్ డేటాను అందిస్తే, ఇటు DVR విజువల్ ఆధారాలను అందిస్తుంది.
వెనుకబడిన దర్యాప్తుకు చక్కటి ఆధారం
DVRను డీకోడ్ చేస్తే విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలు, సంబంధిత సాంకేతిక లోపాలు, పైలట్ చర్యలు వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉంది. ఇది దర్యాప్తును మళ్లీ వేగవంతం చేసే అవకాశం ఉంది.

